chirala: నాగార్జునరెడ్డిపై దాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు: ఆమంచి కృష్ణమోహన్

  • నాగార్జునరెడ్డి అనే వ్యక్తి జర్నలిస్టే కాదు
  • గత ఎన్నికల్లో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ 
  • టీడీపీలో నాగార్జునరెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు

చీరాల విలేకరి నాగార్జునరెడ్డిపై జరిగిన దాడి విషయంలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమంచి స్పందిస్తూ, చంద్రబాబు తన చేతిలో మీడియా ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జునరెడ్డిపై దాడికి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అసలు, నాగార్జునరెడ్డి అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదని, గత ఎన్నికల్లో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ అని అన్నారు. టీడీపీలో నాగార్జునరెడ్డి క్రియాశీలకంగా ఉన్నారని, కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడని అన్నారు. గతంలో నాగార్జునరెడ్డిపై 17 క్రిమినల్ కేసులు ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయనపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. నాగార్జునరెడ్డి తన భార్యను వేధించిన కేసులతో పాటు నక్సలైట్ పేరిట బెదిరింపులకు పాల్పడిన కేసులు ఉన్నాయని అన్నారు. నాగార్జునరెడ్డిని తన పార్టీకి చెందిన వ్యక్తిగా చంద్రబాబు చెప్పుకోలేకపోతున్నారని, బాబు దిగజారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News