sama tirumal reddy: వర్షపు నీటితో నిండిన హైదరాబాద్ రోడ్లు.. నీటిలో పడుకుని నిరసన తెలిపిన కార్పొరేటర్

  • గ్రీన్ మిడోస్ కాలనీలోకి వర్షపు నీరు
  • అవస్థలుపడిన స్థానికులు
  • పరిష్కరించాలని కోరుతూ వినూత్న నిరసన చేపట్టిన కార్పొరేటర్

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. నగరవాసులను ఈ వాన బెంబేలెత్తించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారు. హయత్‌నగర్ డివిజన్‌లోని సుష్మా సాయినగర్ ‘గ్రీన్ మిడోస్ కాలనీ’లోకి వెళ్లే దారి కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఇళ్లకు వెళ్లే దారిలేక కాలనీ వాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

దీంతో వారు ఆ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వర్షపు నీటిలో పడుకుని నిరసన తెలిపారు. కాగా, తిరుమల్ రెడ్డి గతంలోనూ ఇలానే వినూత్నంగా నిరసన తెలిపి వార్తల్లోకి ఎక్కారు. రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తూ, నాలాల్లో చెత్తను తొలగిస్తున్న ఆయన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

More Telugu News