america: ట్రంప్‌కు షాక్.. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన డెమోక్రాట్లు

  • అధ్యక్ష ఎన్నికలకు ముందు రసవత్తరంగా అమెరికా రాజకీయాలు
  • పోటీలో నిలవనున్న జో బిడెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నాలు
  • బయటపడడంతో అభిశంసనకు సిద్ధమైన డెమోక్రాట్లు

అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు నిన్న అభిశంసన దర్యాప్తు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈసారి అధ్యక్ష రేసులో నిలిచేందుకు రెడీ అవుతున్న మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు ట్రంప్ ఉక్రెయిన్ సహాయం తీసుకున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

జో బిడెన్ కుమారుడు హంటర్ గతంలో ఉక్రెయిన్‌తో వ్యాపారాలు చేసిన నేపథ్యంలో ట్రంప్ దీనిని అవకాశంగా తీసుకున్నారని, ఇద్దరిపైనా అవినీతి ఆరోపణలు చేసి దర్యాప్తు చేయించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డీమిర్ జెలినిస్కీపై ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఒత్తిడి పెంచడంలో భాగంగా  ఆ దేశ రక్షణ అవసరాల కోసం ఇవ్వాల్సిన 400 మిలియన్ డాలర్ల సహాయాన్ని ట్రంప్ ఆపేశారు. ఈ మేరకు జులై 25న ట్రంప్ ఫోన్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో డెమోక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన దర్యాప్తుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తనపై వచ్చిన ఆరోపణలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డెమోక్రాట్లు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ అధ్యక్షుడికీ ఇటువంటి పరాభవం జరగలేదని వాపోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడడం నిజమేనని అయితే, అది స్నేహపూర్వక సంభాషణ మాత్రమేనని వివరణ ఇచ్చారు. అలాగే, ఆ దేశ రక్షణ అవసరాలకు ఇవ్వాల్సిన నిధులను తొలుత ఆపేసినా, తర్వాత విడుదల చేసినట్టు ట్రంప్ తెలిపారు.

More Telugu News