Amitabh Bachchan: అమితాబ్‌కు అభినందనల వెల్లువ.. పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారన్న చిరంజీవి!

  • అమితాబ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన కేంద్రం
  • ఆ పురస్కారానికి మీరు అర్హులేనన్న రజనీకాంత్
  • కోట్లాదిమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్న నాగ్

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు రావడంపై భారతీయ చిత్ర పరిశ్రమ స్పందించింది. ‘సైరా’ సినిమాలో కీలకపాత్ర పోషించిన అమితాబ్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు.

1969లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ గత యాభై ఏళ్లలో చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించారని కొనియాడారు. యుక్తవయసులో యాంగ్రీ యంగ్‌మన్ అనిపించుకున్న అమితాబ్.. ఇప్పుడు వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని అన్నారు. ‘సైరా’లో గోసాయి వెంకన్న పాత్రలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం విడుదల కాబోతున్న తరుణంలో ఆయనకు ఈ అవార్డు ప్రకటించడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అమితాబ్‌కు అవార్డు రావడంతో ‘సైరా’ యూనిట్ మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిందని చిరంజీవి అన్నారు.  

తమిళ, మలయాళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, మోహన్‌లాల్‌తోపాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంపై స్పందించారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు, అభినందనలు’ అని రజనీకాంత్ ట్వీట్ చేయగా,  దాదాసాహెబ్ పురస్కారం అర్హత కలిగిన వ్యక్తినే వరించిందని మోహన్‌లాల్ పేర్కొన్నారు. అమితాబ్ తన నటనతో కోట్లాదిమందికి వినోదం పంచడంతోపాటు వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, ఆయనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున ట్వీట్ చేశారు.

More Telugu News