Telangana: నదుల అనుసంధానం విషయాన్ని పక్కనబెట్టి నిరుద్యోగ సమస్య పరిష్కరించండి: ప్రొఫెసర్ కోదండరామ్

  • గోదావరి నీటిని కృష్ణకు తరలించాలన్న ఆలోచనపై విమర్శలు
  • తెలంగాణ తన నీళ్లను  వదులుకున్నట్టే
  • ఇలా చేస్తే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది

నదుల అనుసంధానం విషయాన్ని పక్కనబెట్టి  రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను ముందుగా పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నల్గొండలో ఈరోజు నిర్వహించిన నిరుద్యోగుల సదస్సుకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, నదుల అనుసంధానం విషయమై ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ చేస్తున్న చర్చలను పక్కనపెట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పూనుకోవాలని కోరారు. గోదావరి నీటిని కృష్ణా నదిలోకి పంపడం కన్నా కృష్ణా పరీవాహక ప్రాంతాలకు ఇవ్వడం లాభం అని అభిప్రాయపడ్డారు. అదేసమయంలో గోదావరి నీటిని ఇవ్వడంపైనా ఆయన విమర్శలు చేశారు. కృష్ణా నదిలోకి గోదావరి నీటిని తరలించడం అంటే తెలంగాణ తన నీళ్లను తాను వదులుకున్నట్టేనని, ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని, దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.   

More Telugu News