Viral Videos: వామ్మో.. ఇదెక్కడి ఫీట్‌రా బాబూ.. కాళ్లతో ఆటో నడుపుతూ వెనక చక్రం మార్చిన యువకుడు!

  • వీడియోను పోస్టు చేసిన హర్ష్ గోయెంకా
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • తిట్టిపోస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సంచలనాలు ఎక్కువైపోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఫీట్లు, అరుదైన విన్యాసాల వీడియోలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం వీటికి భిన్నం. చూసినవారు ముక్కున వేలేసుకోవడం కాదు.. తిట్టిపోస్తున్నారు కూడా. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది.

ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఓ ఆటో డ్రైవర్ తన కాళ్లతో ఆటోను వేగంగా నడుపుతూ, అదే సమయంలో ఆటో వెనక టైరును విప్పి మరో టైరును బిగించాడు. ప్రపంచంలో బహుశా ఎవరూ చేయని ఇలాంటి సాహసాన్ని అవలీలగా చేసేశాడు. కాళ్లతో ఆటోను డ్రైవ్ చేస్తూ చేతులతో టైరు విప్పి బిగిస్తుంటే ముందు వెనక వస్తున్న వాహనదారులు బెంబేలెత్తిపోయారు. ఈ వీడియో క్యాప్షన్‌లో హర్ష్ గోయెంకా.. తాను చాలాసార్లు టైర్లు మార్చడం చూశానని, జేమ్స్ బాండ్ స్టైల్‌లో మార్చగా చూడడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఫీట్లేంటని దుమ్మెత్తి పోస్తున్నారు. నిజంగా ఇది జేమ్స్‌బాండ్ స్టైలే అయినా ప్రాణాలతో చెలగాటం కూడదని హితవు పలుకుతున్నారు. ఇటువంటి వాటిని ఇంకెవరూ అనుకరించవద్దని సూచిస్తున్నారు. మరోమారు ఇలాంటి పని చేయకుండా తీసుకెళ్లి జైల్లో పడేయాలని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News