Dhulipala Narendra Kumar: రివర్స్ టెండరింగ్ లో ఒకే సంస్థ టెండర్ వేసిందంటే అర్థం ఏంటి?: ధూళిపాళ్ల నరేంద్ర

  • రాష్ట్రంపై రూ.1600 కోట్ల భారం పడుతుందన్న టీడీపీ నేత
  • మేఘా సంస్థకు టెండరు ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్
  • సర్కారుపై నమ్మకం లేకే ఇతర సంస్థలు ముందుకు రాలేదంటూ వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టు పనుల కోసం తాజాగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రంపై రూ.1600 కోట్ల మేర భారం పడుతుందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రివర్స్ టెండరింగ్ లో ఒకే సంస్థ టెండర్ వేసిందంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. జీవో 67 నిబంధనలకు విరుద్ధంగా ఒకే సంస్థకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అసలు, ఏ విశ్వసనీయతతో మేఘా సంస్థకు టెండరు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై విశ్వసనీయత ఉంటే కేవలం ఒక్క సంస్థే టెండరు ఎలా వేసిందని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకే ఇతర సంస్థలు ముందుకు రాలేదని నరేంద్ర వ్యాఖ్యానించారు.

కాంట్రాక్టు సంస్థకు రూ.300 కోట్లు ఇచ్చారని, పనుల్లో జాప్యం వల్ల రూ.300 కోట్ల వరకుభారం పడుతుందని అథారిటీ చెప్పిందని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా మరో రూ.1000 కోట్ల వరకు భారం పడుతుందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోదావరి జిల్లాల భద్రతను పణంగా పెడుతున్నారని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News