KCR: కేసీఆర్ కోసం ప్రపంచబ్యాంకుతో మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలేమో?: విజయశాంతి వ్యంగ్యం

  • సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు
  • రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారు
  • లక్షల కోట్ల ఆర్థిక భారాన్ని మోయలేక తెలంగాణ ఆర్థికశాఖ సతమతమవుతోంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మండిపడ్డారు. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించిన కేసీఆర్... స్కీముల పేరుతో స్కాములు చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని ఆమె ఆరోపించారు.

ఈ వాస్తవాలను అడిగితే... ఈ పాపం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిది, గతంలో పాలించిన కాంగ్రెస్‌ది అంటూ.. గులాబీ బాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీల వంటి జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని కేసీఆర్ అంటున్నారని... మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అవే జాతీయ పార్టీల చేతుల్లో ఎందుకు 7 సీట్లలో ఓడిపోయింది? అని ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందని సూచించారు.

ఇప్పటికే మూడు లక్షల కోట్ల భారాన్ని మోయలేక తెలంగాణ ఆర్థిక శాఖ సతమతమవుతుంటే... తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీని గల్లంతు చేసేందుకు మరో మూడు స్కీములు తన అమ్ముల పొదిలో ఉన్నాయని కేసీఆర్ చేసిన ప్రకటన చూసి నవ్వాలో? ఏడవాలో? తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదని విజయశాంతి అన్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన కేసీఆర్... కొత్తగా ప్రకటించబోతున్న స్కీమ్‌లకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారో? స్కీములు అమలుచేసే పేరుతో ఎన్ని కోట్ల స్కాంలకు పాల్పడతారో? అనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదని తెలిపారు.

కేసీఆర్ కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి పేర్లతో గనక మళ్లీ అప్పులు చేయడం మొదలుపెడితే కాంగ్రెస్, బీజేపీల మాట ఏమో కానీ అప్పుల బాధ తట్టుకోలేక ఈసారి తెలంగాణ ప్రజలు గల్లంతైపోయే ప్రమాదం ఉందని విజయశాంతి అన్నారు. కేసీఆర్ వాలకాన్ని చూస్తుంటే... పథకాల పేరుతో ఆయన చేస్తున్న ఖర్చులు, వాటి కారణంగా పెరుగుతున్న అప్పులను తీర్చేందుకు... చివరకు మోదీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకోవాలేమోనని వ్యంగ్యంగా అన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.

More Telugu News