ATS: ఏటీఎస్‌కు చిక్కిన మోస్ట్ వాంటెడ్ అల్‌ఖైదా ఉగ్రవాది కలీముద్దీన్

  • 2016 నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాది
  • అతడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు
  • టాటానగర్ రైల్వే స్టేషన్‌లో చిక్కిన కలీముద్దీన్

మూడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్‌వాంటెడ్ అల్‌ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) ఉగ్రవాది కలీముద్దీన్ ముజాహిరీని ఝార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జంషెడ్‌పూర్‌లోని టాటానగర్ రైల్వే స్టేషన్‌లో ఏటీఎస్ బృందం ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. కలీముద్దీన్‌ ఆజాద్‌నగర్‌లోని తన ఇంటికి రాబోతున్నాడన్న పక్కా సమాచారంతో నిఘా వేసిన ఈ బృందం అతడు రాగానే అదుపులోకి తీసుకుంది.

ఉగ్రవాది కలీముద్దీన్ తరచూ ప్రదేశాలు మారుస్తుండడంతో అతడిని పట్టుకోవడం సవాలుగా మారిందని, దీంతో అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు. యువతను ప్రేరేపించి ఏక్యూఐఎస్‌లో చేర్పించడంలో కలీముద్దీన్ దిట్ట అని అధికారులు తెలిపారు. అల్‌‌ఖైదాలోని అగ్రనేతలతో అతడికి సంబంధాలున్నట్టు తెలిపారు.

2016 ముందు వరకు జైలులో ఉన్న కలీముద్దీన్ స్థానిక నాయకుల జామీనుపై విడుదలయ్యాడు. ఆ తర్వాతి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. కొడుకు హైజఫాతో కలిసి బంగ్లాదేశ్, లేదంటే నేపాల్ పారిపోయి ఉంటాడని పోలీసులు భావించారు. అతడి కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టారు. తాజాగా పక్కా సమాచారంతో అతడిని అరెస్ట్ చేశారు.

More Telugu News