Rajnath Singh: 1965, 71 నాటి తప్పులు పునరావృతం చేశారంటే మిమ్మల్ని ఏ శక్తి కాపాడలేదు: పాకిస్థాన్ కు రాజ్ నాథ్ సింగ్ హెచ్చరిక

  • పీఓకే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని పాక్ కు హితవు
  • తప్పులు పునరావృతమైతే పాక్ రెండు ముక్కలవుతుందన్న రాజ్ నాథ్
  • పాట్నాలో రాజ్ నాథ్ వ్యాఖ్యలు

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. 1965, 1971 నాటి తప్పులు మళ్లీ చేశారంటే మాత్రం మిమ్మల్ని ఏ శక్తి కాపాడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ చేస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని అన్నారు. బలూచ్, పష్తూన్ ప్రజల పట్ల అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అది కొనసాగితే పాక్ రెండు ముక్కలు కావడం తథ్యం అంటూ వ్యాఖ్యానించారు.  సొంతగడ్డపై మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న పాక్ కుప్పకూలే దిశగా పయనిస్తోందని అన్నారు.

"పీఓకే వెళ్లిన పాక్ ప్రధాని పొరబాటున కూడా ఇండో-పాక్ బోర్డర్ వద్దకు వెళ్లొద్దని అక్కడి వాళ్లకు చెప్పారు. ఆయనలా చెప్పడాన్ని నేను స్వాగతిస్తున్నా. ఒకవేళ ఎవరైనా సరిహద్దుల్లో అడుగుపెడితే మాత్రం పాకిస్థాన్ కు తిరిగి వెళ్లడమంటూ ఉండదు. పాక్ ఎగదోసిన ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టం. ఆర్టికల్ 370 రద్దుపై 67 శాతం కశ్మీర్ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఒకదేశంలో ఉగ్రవాదులు మరో దేశంలో సమరయోధులు ఎలా అవుతారు?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన జన్ జాగరణ్ సభలో రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News