Adilabad District: నిర్దయ...రోడ్డు బాగులేదని బాలింతను మధ్యలో దింపేసిన 102 అంబులెన్స్‌ డ్రైవర్

  • గంటన్నరపాటు ఓ దుకాణం ముందు నేలపైనే బాధితురాలు
  • పురిటినొప్పులు రావడంతో ఇంద్రవెళ్లి ఆసుపత్రికి
  • ప్రసవానంతరం ఈ దుస్థితి

వైద్య సహాయకులకు మానవత్వం, సేవా గుణం రెండూ ఉండాలి. కానీ ఓ 102 వాహన చోదకుడు చేసిన పని చూస్తే ఈ రెండూ లేవనిపించక మానదు. ఆమె ప్రసవించి ఐదు గంటల సమయమే అయ్యింది. వాహనంలో బాలింతను స్వగ్రామానికి తరలిస్తూ రోడ్డు బాగులేదని మార్గ మధ్యలోనే వదిలేసి తన నిర్వాకాన్ని చాటుకున్నాడు ఆ డ్రైవర్. వివరాల్లోకి వెళితే...ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం చెమ్మన్‌గూడకు చెందిన రాథోడ్‌ కల్పనకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. శనివారం ఉదయం ఐదు గంటలకు ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం సజావుగా సాగడంతో  మధ్యాహ్నం వేళ ఆమెను ఇంటికి తీసుకువెళ్లి దించి రావాలని 102 అంబులెన్స్‌ సిబ్బందికి వైద్యులు సూచించారు.

ఆసుపత్రి నుంచి బయలుదేరిన వాహన చోదకుడు సిరికొండకు వచ్చాక వాహనం ముందుకు వెళ్లాలంటే రోడ్డు బాగోలేదంటూ అక్కడే బాలింతను, ఆమె సహాయకురాలిని దించేశాడు. సిరికొండకు చెమ్మన్‌గూడ గ్రామం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ సమయంలో ప్రైవేటు వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో దాదాపు గంటన్నరపాటు రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణం ముందు బాలింతను నేలపైనే కుటుంబ సభ్యులు పడుకోబెట్టారు. ఆ తర్వాత ఓప్రైవేటు వాహనాన్ని సమకూర్చుకుని గ్రామానికి వెళ్లారు.

More Telugu News