శారద చిట్‌ఫండ్ కుంభకోణం.. మాజీ ఐపీఎస్ రాజీవ్ కుమార్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

22-09-2019 Sun 09:44
  • శారద చిట్‌ఫండ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ కుమార్
  • సీబీఐ విచారణకు హాజరు కాని మాజీ ఐపీఎస్
  • బెయిలు పిటిషన్‌ను తోచిపుచ్చిన కోర్టు
శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తు బెయిలు కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును శనివారం అలీపోర్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన అరెస్ట్‌కు సీబీఐ రెడీ అవుతోంది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ బృందం ఒకటి ఇప్పటికే కోల్‌కతా చేరుకుంది.

నిజానికి రాజీవ్ కుమార్‌ గత మంగళవారమే సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు. ఆయన అరెస్ట్‌కు వారెంటు అవసరం లేదని సిటీ కోర్టు పేర్కొంది. దీంతో అరెస్ట్ తప్పదని భావించిన రాజీవ్ కుమార్ అలీపోర్ కోర్టులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం బెయిలుపై వాదనలు జరగ్గా తీర్పును రిజర్వు చేసిన కోర్టు నిన్న రాజీవ్ కుమార్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో సీబీఐకి లైన్ క్లియర్ అయింది. నేడు రాజీవ్‌ను ఏ క్షణమైనా సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.