Sairaa: ఉయ్యాలవాడ వంశీయుల ఆరోపణలపై రామ్ చరణ్, సురేందర్ రెడ్డిల స్పందన!

  • వందేళ్లు దాటిన కథలకు కుటుంబీకుల అనుమతి అవసరం లేదు
  • ఏ నలుగురి కోసమో సినిమా తీయలేదన్న రామ్ చరణ్
  • ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి, కథను సిద్ధం చేశానన్న సురేందర్ రెడ్డి

తమ పూర్వీకుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చిత్రంగా నిర్మిస్తూ, తమకిస్తామన్న రూ. 50 కోట్లను ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, 23 మంది జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో చిత్ర నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి స్పందించారు. తాము కేవలం ఓ నలుగురి కోసం ఈ సినిమాను తీయలేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. 100 సంవత్సరాలు దాటిన కథలకు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అనుమతీ అక్కర్లేదన్నారు.

ఇదే విషయమై స్పందించిన చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి, తాము ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి, ఈ కథను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ఈ కథ ఏ కొద్దిమంది నుంచో సేకరించింది కాదన్నారు. ఇదిలావుండగా, తమకు క్లయిమ్ ను ఇస్తామని చెబుతూ అగ్రిమెంట్ రాసుకున్న చిత్ర నిర్మాత, ఆ క్లయిమ్ ఏంటన్న విషయాన్ని మాత్రం చెప్పలేదని, వెంటనే తమకు న్యాయం చేయాలని, లేకుంటే, చిత్ర విడుదలను నిలిపివేయాలని నిన్న ఉయ్యాలవాడ వంశీకులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News