nirmala sitaraman: మధ్యతరగతి జీవులకూ ఊరట.. రాయితీల యోచనలో కేంద్రం

  • త్వరలోనే కేంద్రం నుంచి మరో ప్రకటన
  • కార్పొరేట్‌ సంస్థలకు పన్ను మినహాయింపు నేపథ్యంలో విమర్శలు
  • వీలైనంత త్వరగా అమలు చేసే యోచనలో కేంద్రం

మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం కార్పొరేట్ పన్నును 8 శాతం నుంచి 10 శాతం మేర తగ్గించి ఊరట కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మధ్యతరగతిపై దృష్టి సారించింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో కొన్ని రాయితీలు కల్పించడం ద్వారా వారికి ఊరటనివ్వాలని యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్రం చేతికి వచ్చినప్పటికీ అమలు కంటే ముందు కొంత చర్చ జరిగితే బాగుంటుందని కేంద్రం కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.

మధ్యతరగతికి రాయితీలు కల్పించే విషయంలో గతంలో ఆర్థిక శాఖ నియమించిన ఓ టాస్క్‌ఫోర్స్ ఇందుకు సంబంధించిన నివేదికను గత నెలలోనే మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించినట్టు సమాచారం. కార్పొరేట్‌కు పన్ను తగ్గింపు ప్రకటన తర్వాత సామాన్యుల సంగతేంటన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే మధ్యతరగతికి ఊరటనిచ్చే ప్రకటన వెలువడవచ్చని దీనితో సంబంధం ఉన్న సన్నిహిత వర్గాలు తెలిపాయి.  

More Telugu News