chandrayaan-2: వచ్చే ఏడాది మరోమారు చంద్రమండల యాత్ర: ఇస్రో చైర్మన్ కె.శివన్

  • భువనేశ్వర్ ఐఐటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న శివన్
  • 2021లో అంతరిక్షంలోకి భారతీయుడు
  • అర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి వరకు విజయవంతంగా సాగినప్పటికీ చివరి క్షణంలో జాబిల్లిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది. దానితో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

వైఫల్యాలపై ఇస్రో శాస్త్రవేత్తల మేధోమథనం ప్రారంభమైంది. అయితే, వైఫల్యం తమను కుంగదీయబోదని, వచ్చే ఏడాది మరోమారు ప్రయోగాన్ని చేపట్టి చంద్రుడిపైకి ల్యాండర్‌ను విజయవంతంగా దింపుతామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. శనివారం భువనేశ్వర్‌ ఐఐటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న శివన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  

చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, రోవర్‌లతో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఆర్బిటర్ మాత్రం చక్కగా పనిచేస్తోందన్నారు. ‘గగన్‌యాన్’ ప్రయోగంలో భాగంగా డిసెంబరు 2021లో రోదసీలోకి భారతీయుడిని పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు శివన్ వివరించారు.

ఆర్బిటర్‌లో అమర్చిన 8 పరిశోధక పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్న శివన్.. అవి తీసి పంపిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయన్నారు. జాబిల్లిపై ఆర్బిటర్ విస్తృత పరిశోధనలు చేయనుందని పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో చేసిన అద్భుత ప్రణాళిక వల్ల ఆర్బిటర్ జీవిత కాలం ఏడాదిన్నర నుంచి ఏడున్నర సంవత్సరాలకు పెరిగిందని అన్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టు 98 శాతం విజయం సాధించిందని స్పష్టం చేశారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది మరోమారు చంద్రమండల యాత్ర చేపడతామని, ప్రస్తుతం తమ దృష్టి మొత్తం దీనిపైనే ఉందని శివన్ వివరించారు.

More Telugu News