India: వాయుసేన మరింత పటిష్టం.. తొలి రాఫెల్ ఫైటర్ జెట్ ను అందుకున్న భారత్!

  • యుద్ధ విమానాన్ని అందించిన ఫ్రాన్స్
  • గంటపాటు విహరించిన ఐఏఎఫ్ అధికారులు
  • 2020లో భారత్ కు చేరనున్న 36 ఫైటర్ జెట్లు

భారత వాయుసేనను మరింత పటిష్టం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఫ్రాన్స్ నుంచి భారత్ తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకుంది. ఈ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి అందుకున్న భారత ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి బృందం గంటపాటు ఈ ఫైటర్ జెట్ లో విహరించింది. ఫ్రాన్స్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం మరో 7 నెలల పాటు ఆ దేశంలోనే రాఫెల్ యుద్ధ విమానాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ యుద్ధవిమానం తోకపై ఆర్బీ-01 అనే నంబర్ ఇచ్చారు. భారత వాయుసేన నూతన అధిపతి ఆర్కేఎస్ భదౌరియా పేరు మీదుగా ఈ సంఖ్యను ఇచ్చారు.

భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చే నెల 8వ తేదీన ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలను అధికారికంగా అందుకుంటారు. భారత పైలెట్లకు శిక్షణ అనంతరం వచ్చే ఏడాది మే నెలలో ఈ యుద్ధ విమానాలు భారత్ కు చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని 2015లో భారత్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.58,000 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రాఫెల్ ఫైటర్ జెట్లను తయారుచేస్తున్న కంపెనీ డసో ఏవియేషన్స్ భారత్ కు మిటియర్ క్షిపణులతో పాటు పలు అత్యాధునిక ఆయుధాలను అందజేయనుంది.

More Telugu News