East Godavari: బోటు ప్రమాద ఘటన.. పోలీసులు తీసిన ఫొటోలు ఎందుకు బయటపెట్టట్లేదు?: మాజీ ఎంపీ హర్షకుమార్

  • కేవలం, సమీక్ష నిర్వహించి వెళ్లిపోతే సరిపోతుందా?
  • కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని చెబితే చాలా?
  • సీఎం జగన్ ని ప్రశ్నించిన హర్షకుమార్

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో ఇటీవల సంభవించిన బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ మరోమారు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదావరి నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని విమర్శించారు.  సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన ప్రభుత్వాన్ని తాను నిలదీయడం వల్లే మళ్లీ కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజలు, బాధితుల తరఫున తాను మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని అన్నారు.

చంద్రబాబు హయాంలో పుష్కరాల ప్రమాద ఘటనపై నాడు వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఘటనకు సంబంధించి ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని నాడు విమర్శలు చేశారని, మరి, బోటు ప్రమాద ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేవలం, సమీక్ష నిర్వహించి వెళ్లిపోతే సరిపోతుందా? కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెబితే సరిపోతుందా? అని సీఎం జగన్ ని ప్రశ్నించారు.

‘ఆ బోటులో 93 మంది లేకపోతే, పోలీసులు తీసిన ఫొటోలు ఎందుకు బయటపెట్టట్లేదు?’ అని ప్రశ్నించారు.  

More Telugu News