Stock Markets: మేడమ్ చలవతో దూసుకుపోయిన మార్కెట్లు!

  • కార్పొరేట్ పన్ను తగ్గించిన కేంద్రం
  • పన్నుల రంగంలో సంస్కరణలు ప్రకటించిన నిర్మలా సీతారామన్
  • పదేళ్ల తర్వాత అన్ని సూచీలు లాభాలు ఆర్జించిన వైనం

దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్ లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు అందించే క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ పన్నుల రంగంలో సంస్కరణలకు తెరలేపారు. దాంతో, మార్కెట్లు దూసుకుపోగా, లాభాల సూచీలు పరుగులు పెట్టాయి.

సెన్సెక్స్ 1921 పాయింట్ల వృద్ధితో 38,014 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 569 పాయింట్ల పెంపుతో 11,274 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లో హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకీ షేర్లు లాభాలు కళ్లజూడగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్టీపీసీ షేర్లు ఓ మోస్తరు నష్టాలు చవిచూశాయి.

మేడమ్ నిర్మలా సీతారామన్ పుణ్యమా అని ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.6 లక్షల కోట్లు పెరిగింది. 2009 తర్వాత అన్ని సూచీలు ఒకే రోజు ఈ స్థాయిలో లాభాలు ఆర్జించడం ఇదే ప్రథమం. కేంద్రం పన్ను సంస్కరణల నేపథ్యంలో రూపాయి కూడా బలపడింది. ప్రస్తుతం రూపాయితో డాలర్ మారకం విలువ రూ.71.05గా కొనసాగుతోంది.

More Telugu News