USA: అమెరికాలో దోపిడీయత్నం విఫలం.. భారతీయ విద్యార్థిని కాల్చిచంపిన దుండగులు!

  • షికాగోలోని ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ వద్ద ఘటన
  • విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన బల్జీత్
  • అడ్డగించి పర్సు, సెల్ ఫోన్ ఇవ్వాలని దొంగల డిమాండ్

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. ఓ భారతీయ యువకుడి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అమెరికాలోని షికాగో నగరంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కు చెందిన బల్జీత్ సింగ్(28) అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. ఖాళీ సమయాల్లో షికాగోలోని ఓ డిపార్ట్ మెంట్ స్టోర్ లో పార్ట్ టైమ్ ఉద్యోగిగా చేరాడు. ఈ క్రమంలో విధులు ముగించుకుని రాత్రి ఇంటికి బయలుదేరిన బల్జీత్ ను కొందరు దుండగులు తుపాకులతో అడ్డగించారు.

నగదు, సెల్ ఫోన్ ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే బల్జీత్ నగదు, సెల్ ఫోన్ తనవెంట తీసుకురాకపోవడంతో దొంగలు రెచ్చిపోయారు. తుపాకులతో బల్జీత్ పై కాల్పులు జరిపి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బల్జీత్ కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి సమాచారం అందించిన షికాగో పోలీసులు, నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.

More Telugu News