Telangana: యురేనియం తవ్వకాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్, టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ధ్వజం
  • కాంగ్రెస్ హయాంలోనే యురేనియంపై పరిశోధనలు  
  • యురేనియం తవ్వకాలపై గతంలో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చిందని, ఇప్పుడు ఈ అంశంపై అవకాశవాద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. యురేనియం అన్వేషణకు టీఆర్ఎస్ అనుమతిచ్చిందని, అప్పుడు అనుమతిచ్చి, ఇప్పుడు ఇందుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తోందని దుయ్యబట్టారు.

అయినా, కేంద్రం అనుమతిచ్చింది యురేనియం అన్వేషణకు మాత్రమేనని, దేశ ఖనిజ సంపదపై డేటా బేస్ తయారు చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఖనిజ సంపదపై పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయని, యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలకన్నా, బొగ్గు తవ్వకాలతోనే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని మంత్రి వ్యాఖ్యానించారు.

More Telugu News