Boat Accident: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు

  • బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారు
  • ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారు
  • బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి ఇవ్వలేదు

పాపికొండల వద్ద సంభవించిన బోటు ప్రమాదంపై మాజీ మంత్రి హర్ష కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని అన్నారు. ప్రమాద సమయంలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారని... దీనికి సంబంధించి తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు.

మృతుల సంఖ్యను తక్కువగా చూపెట్టేందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నానికే బోటు జాడ తెలిసిందని... అయితే లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయనే భయంతో బోటును వెలికి తీయడం లేదని విమర్శించారు. సంచలనం కోసమో, పేరు సంపాదించడం కోసమో తాను ఈ విషయాలను వెల్లడించడం లేదని అన్నారు.

బోటులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని హర్షకుమార్ ఆరోపించారు. ఇందులో ఫారెస్ట్, టూరిజం, ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని... అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి ఇవ్వలేదని... ఆ తర్వాత టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారని అన్నారు.

More Telugu News