Pakistan: పాకిస్థాన్‌లో హిందూ యువతుల కిడ్నాప్‌: కలకలం రేపుతున్న వార్త

  • గడచిన నాలుగు నెలల్లో 30 మంది అదృశ్యం
  • హిందూ యువతులే లక్ష్యం
  • పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నేత అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావన

గడచిన నాలుగు నెలల నుంచి పాకిస్థాన్‌లో వరుసగా హిందూ యువతులు కిడ్నాప్‌కు గురవుతున్నారని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌కు చెందిన ఓ నాయకుడు ఆరోపించడం తీవ్ర కలకలానికి కారణమైంది. ఇప్పటి వరకు 30 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, హిందువులనే లక్ష్యంగా చేసుకుని దుండగులు దుశ్చర్యకు పాల్పడుతున్నారని సదరు నేత పాక్ పార్లమెంట్‌ సాక్షిగా ప్రస్తావించడం మరింత సంచలనమయ్యింది. సింధు ప్రావిన్సులోని ల‌ర్కానాలో ఇటీవ‌ల ఓ హిందూ మెడిక‌ల్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో చ‌నిపోయింది. యూనివ‌ర్సిటీ వర్గాలు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించగా, ఆమె తల్లిదండ్రులు  మాత్రం హత్య జ‌రిగిన‌ట్లు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఖేల్ దాస్ కోహిస్తానీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అసలే దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో బయటకు వచ్చిన ఈ వార్త కలకలం రేపుతోంది. న‌వాజ్ పార్టీకి చెందిన‌ ఖేల్ దాస్ కోహిస్తానీ పాక్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ  హిందూ మ‌హిళ‌ల ప‌ట్ల ఎన్నాళ్లు ఈ అకృత్యాలు కొనసాగిస్తారన్నారు.

సింధు ప్రావిన్సులోని గోట్కీ, ఉమ‌ర్‌కోట్ ప్రాంతంలోనే ఎందుకు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాల‌ని, లేదంటే ఇది ఇక్కడితో ఆగదని,  మొత్తం సింధు ప్రాంతానికి ఈ మంట‌లు పాకుతాయ‌ని హెచ్చరించారు.

More Telugu News