Kadapa District: పోట్లదుర్తిలో విషాదం.. అర్ధరాత్రి వేళ వాగులో కొట్టుకుపోయిన కుటుంబం

  • వాగులో కొట్టుకుపోయిన ఆరుగురు
  • వీరిలో ముగ్గురు చిన్నారులు
  • రెండు రోజులుగా గాలిస్తున్నా ఫలితం శూన్యం

గోదావరిలో బోటు మునక ఘటనను మర్చిపోకముందే మరో విషాదం జరిగింది. శుభకార్యానికి హాజరై అర్ధరాత్రి వేళ ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్న ఓ కుటుంబం వాగులో కొట్టుకుపోయింది. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో జరిగిందీ ఘటన.

స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన మునగాల రామాంజనేయులు (30), ఆయన భార్య పెంచలమ్మ (28), తల్లి సుబ్బమ్మ (55), కుమార్తెలు మేఘన (5), అంజలి (4)తోపాటు వారి ఆరు నెలల అబ్బాయితో కలిసి ఈ నెల 16న దువ్వూరు మండలంలోని గొల్లపల్లెలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం అదే రోజు అర్ధరాత్రి వారంతా తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. వారి ఆటో కామనూరు వద్ద వాగును దాటే ప్రయత్నంలో వరద ఉద్ధృతి కారణంగా బోల్తాపడింది. చీకట్లో ఏం జరుగుతోందో తెలియని వారంతా భయంతో కేకలు వేశారు. గమనించిన స్థానికులు వెంటనే వాగు వద్దకు చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, అర్ధరాత్రి కావడం, చుట్టూ చిమ్మచీకటిగా ఉండడంతో వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. వాగులో కొట్టుకుపోయింది ముగ్గురేనని తొలుత భావించారు.

పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని గాలించినా వారి ఆచూకీ లభించలేదు. కాగా, వాగులో కొట్టుకుపోయింది ముగ్గురు కాదని, మొత్తం ఆరుగురని తేలింది. రెండు రోజులుగా గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో బుధవారం ప్రత్యేక బృందాలను, గజ ఈతగాళ్లను రప్పించారు. అయినప్పటికీ బుధవారం రాత్రి వరకు వారి జాడ లభ్యం కాలేదు. నేడు కూడా వారి జాడ లభించకపోతే ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద గాలింపు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

More Telugu News