led LCD tvs: టీవీ కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం...భారీగా తగ్గనున్న ధరలు

  • టీవీ ప్యానెల్‌ దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం రద్దు
  • ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీల్లో ప్యానెళ్లే అతి ముఖ్యం
  • టీవీలో సగం కంటే ఎక్కువ ఖర్చు దీనిదే

తెరపై బొమ్మ కనీ కనిపించనట్టుండే డబ్బా టీవీతో ఇబ్బంది పడుతున్నారా... ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీ కొనుక్కోవాలని ముచ్చట పడుతున్నారా...అయితే మీకోసమే ఈ వార్త. టీవీ ధరలు భారీగా తగ్గే సమయం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడంతో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీ ధరలు బాగా తగ్గనున్నాయి.

 టీవీలో అతి ముఖ్యమైన భాగం ఇదే కాబట్టి దాదాపు సగం కంటే ఎక్కువ ధర దీనిపైనే ఆధారపడి ఉంటుంది. టీవీ తయారీ వ్యయంలో 60 నుంచి 70 శాతం వరకు ప్యానల్‌కే ఖర్చవుతుంది.  ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు(పీసీబీ), ఫిల్మ్ చిప్‌లపై దిగుమతి సుంకాన్ని కూడా కేంద్రం రద్దు చేసింది. అందువల్లే భారీగా ధరలు తగ్గుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టీవీ ప్యానెళ్లను దిగుమతి చేసుకుంటే 5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తోంది. దాన్ని రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఓపెన్ బ్యాటరీ, 15.6 అంగుళాల కంటే పైన, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్‌సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ) టీవీల ప్యానెల్‌లు భారీగా తగ్గనున్నాయని చెబుతున్నారు.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల తయారీ ఖర్చు తగ్గనుంది. ఫలితంగా టీవీ అమ్మకం ధరలు కూడా 3 నుంచి 4 శాతం వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.

More Telugu News