East Godavari District: దొరికిన బోటు ఆచూకీ.. 200 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తింపు

  • అధునాతన సోనార్ సిస్టంతో కనుగొన్న ఉత్తరాఖండ్ బృందం
  • కాకినాడ నుంచి బోట్లను వెలికి తీసే నిపుణుడు ధర్మాడి సత్యాన్ని పిలిపించిన అధికారులు
  • వెయ్యి మీటర్ల తాడును జారవిడవడం ద్వారా తీసేందుకు యత్నం

తూర్పుగోదావరి జిల్లాలో కచ్చులూరు వద్ద నీట మునిగిన బోటు ఆచూకీ ఎట్టకేలకు లభించింది. నాలుగు రోజుల తర్వాత దాని జాడను కనుగొన్నారు. ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందం తమ వద్దనున్న అధునాతన సోనార్ వ్యవస్థను ఉపయోగించి బోటు 200 అడుగులో ఉన్నట్టు గుర్తించింది. నిన్న ఉదయం 11 గంటలకు బోటును కనుగొన్నప్పటికీ దానిని బయటకు తీయడం ఎలా? అన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నేడు వెలికితీత పనులు మొదలుకానున్నాయి.

బోట్లను వెలికితీయడంలో విశేష అనుభవం ఉన్న కాకినాడకు చెందిన మత్స్యకారుడు ధర్మాడి సత్యం, అతడి సహాయ సిబ్బంది 25 మందిని అధికారులు రప్పించారు. వారు ఇందుకు అవసరమైన తాళ్లు, ఇతర పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, బోటు చిక్కుకున్న ప్రాంతం సుడిగుండాల మధ్య ఉండడంతో సహాయక చర్యలకు వెళ్లే బోట్లను సైతం లోపలికి లాగేసుకునే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

ఇదిలావుండగా, మరోపక్క బోటును వెలికి తీసేందుకు ముంబై నుంచి సాల్వేజ్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన నిపుణుడు గౌరవ్ భక్షిని రప్పించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన భక్షి.. ఆ ప్రాంతంలో ప్రవాహం చాలా వేగంగా ఉండడం, సుడిగుండాలు ఏర్పడుతుండడంతో సహాయక చర్యలకు వెళ్లే బోట్లను ఎక్కువ సేపు నిలిపి ఉంచడం సాధ్యం కాదని గ్రహించారు. పలుమార్లు చర్చల తర్వాత వెయ్యి మీటర్ల పొడవైన భారీ తాడు అవసరమని నిర్ణయించారు. దీంతో నేడు కాకినాడ నుంచి తాడును తెప్పించనున్నారు. అయితే, జోరున కురుస్తున్న వర్షం, సహకరించని వాతావరణం మధ్య వీరి ప్రయత్నాలు ఏమేరకు సఫలీకృతం అవుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News