Telangana: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలకు అవకాశం

  • తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
  • కరీంనగర్ జిల్లాలో మూడు వేల కోళ్లు మృతి
  • మేడిగడ్డ బ్యారేజీ నుంచి 1.20 క్యూసెక్కుల నీటి విడుదల

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రకు సమీపంలో నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం రాత్రి 8:30 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

నల్గొండలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆగకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాల్వలు పొంగిపొర్లగా, రోడ్లు కోతకు గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని తిర్మలాపూర్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి మూడువేల కోళ్లు మృతి చెందాయి. భారీ వర్షం కారణంగా యాదాద్రి కొండపై చేపట్టిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం సాయంత్రం ఎగువ ప్రాంతం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో 16 గేట్ల ద్వారా 1.20 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

సరస్వతి బ్యారేజీ వద్ద 11 గేట్లను ఎత్తి 49,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇక, నాగార్జునసాగర్‌కు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో 68,430 క్యూసెక్కుల ప్రవాహం రాగా 4 గేట్లను ఐదు అడుగులు ఎత్తి 32,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

More Telugu News