Gujarath: హెల్మెట్ లేకుండా దర్జాగా తిరుగుతున్న బైకర్.. జరిమానా విధించేందుకే జంకుతున్న పోలీసులు!

  • గుజరాత్ లోని ఛోటా ఉదయ్ పూర్ లో ఘటన
  • మెమెన్ కు దొరకని సరైన హెల్మెట్
  • చలానా విధించని ట్రాఫిక్ పోలీసులు

ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులను చూస్తేనే చాలు.. వాహనదారులు వణికిపోతున్నారు. కారులో హెల్మెట్ లేదనీ, బైక్ కు సీటు బెల్టు లేదని ఎక్కడ జరిమానా వేస్తారో? అంటూ దడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని ఓ వ్యక్తి మాత్రం దర్జాగా బైక్ పై హెల్మెట్ లేకుండా వెళుతున్నా, పోలీసులు మాత్రం ఆపడంలేదు. మనకెందుకు వచ్చిన గొడవలే.. అంటూ వదిలేస్తున్నారు. ఇంతకూ అతను ముఖ్యమంత్రి, మంత్రుల బంధువేమో? అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతను సాధారణ పౌరుడు మాత్రమే!

కేంద్రం భారీ జరిమానాలతో కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని ఇటీవల తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని ఛోటా ఉదయ్ పూర్ జిల్లాకు చెందిన జకీర్ మెమెన్ ఇదేమీ పట్టించుకోకుండా హాయిగా బైక్ పై వెళుతున్నాడు. దీంతో అతడిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. హెల్మెట్ లేనందుకు భారీ జరిమానా విధించారు. అయితే తాను ఈ జరిమానాను కట్టబోనని మెమెన్ స్పష్టం చేశాడు.

ఉదయ్ పూర్ మొత్తం గాలించినా తన తల సైజుకు తగ్గ హెల్మెట్ దొరకలేదని వాపోయాడు. తన సైజు హెల్మెట్ ఎక్కడ దొరుకుతుందో చెబితే కొనుక్కుంటానని వేడుకున్నాడు. దీంతో పోలీసులు సమీపంలోని హెల్మెట్ షాపులో ప్రయత్నించగా, ఏ ఒక్క హెల్మెట్ కూడా మెమెన్ తలకు సరిపోలేదు. దీంతో అతని వాహన పత్రాలను పోలీసులు పరిశీలించగా, అన్నీ సరిగ్గానే ఉన్నాయి. దీంతో పోలీసులు అతడిని విడిచిపెట్టేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులను చూసి ఓవైపు ప్రజలు భయపడుతుంటే, మెమెన్ మాత్రం హాయిగా హెల్మెట్ లేకుండానే రోడ్లపై తిరిగేస్తున్నాడు.

More Telugu News