goods train: డ్రైవర్‌ లేకుండానే పట్టాలపై పరుగందుకున్న గూడ్స్‌ రైలు!

  • 50 కిలోమీటర్లు వెళ్లాక దానంతట అదే ఆగిన వైనం
  • ఆగివున్న రైలు హఠాత్తుగా బయలుదేరడంతో కంగారు పడిన సిబ్బంది
  • ఎన్నిప్రయత్నాలు చేసినా ఫలించని వైనం

స్టేషన్‌లో ఆగివున్న ఓ గూడ్స్‌ రైలు హఠాత్తుగా దానంతట అదే బయలుదేరింది. సిబ్బంది ఆశ్చర్యపోతూ ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏంచేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్న సమయంలో యాభై కిలోమీటర్ల దూరం వెళ్లాక రైలు దానంతట అదే ఆగడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రాజస్థాన్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే...ఎల్‌ఎండ్‌టీ సంస్థకు చెందిన మెటీరియల్‌ తరలిస్తున్న ఓ గూడ్స్‌ రైలును రాజస్థాన్‌లోని సెంద్రా రైల్వేస్టేషన్‌లో డ్రైవర్‌ నిలిపి ఉంచాడు. లోకో పైలట్‌ కిందికి దిగిన కాసేపటికి రైలు దానంతట అదే కదిలి మెల్లగా వేగాన్ని అందుకుని స్టేషన్‌ దాటిపోయింది. పరిస్థితి గమనించిన అధికారులు తర్వాత స్టేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

దారిలో ఉన్న రైల్వే గేట్లన్నింటినీ మూసివేయించారు. పట్టాలపై రాళ్లు, ఇసుక బస్తాలు వేయించారు. అయినా ఫలితం లేకపోయింది. దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాక సోజాత్‌ స్టేషన్‌ దగ్గర రైలు దానంతట అదే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇంజిన్‌ ఆన్‌లో ఉండగా లోకోపైలట్‌ నిర్లక్ష్యంగా కిందకు దిగడం వల్లే ఇలా జరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని, లేదంటే ఘోరమే జరిగేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News