plumber: ఈ ప్లంబర్ చాలా స్పెషల్.. పేదలు, వృద్ధుల దగ్గర నయాపైసా తీసుకోకుండానే సేవలు!

  • ఇంగ్లాండ్ లోని లివర్ పూల్ లో ఘటన
  • ఉచితంగా సేవలు అందిస్తున్న అండర్సన్
  • సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు

అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో కొన్ని చోట్ల చలి విపరీతంగా ఉంటుంది. అక్కడి వాతావరణానికి తగినట్లు ఇంట్లో హీటర్లు ఉండాల్సిందే. లేదంటే గడ్డకట్టుకుపోతారు. కానీ బ్రిటన్ లోని కొందరు నిరుపేదలు, వృద్ధులు తమ బాయిలర్లు, హీటర్లు చెడిపోయినా డబ్బులులేని కారణంగా చలిలోనే గడుపుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఇంగ్లాండ్ లోని లివర్ పూల్ కు చెందిన ప్లంబర్ జేమ్స్ అండర్సన్(52) ముందుకొచ్చాడు. డెఫెర్ అనే కంపెనీ ప్రారంభించిన జేమ్స్ వృద్ధులు, నిరుపేదల ఇళ్లలో ప్లంబింగ్ పనులు చేసినప్పుడు డబ్బులేం తీసుకోడు. ఇటీవల 91 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో జేమ్స్ బాయిలర్ కు మరమ్మతులు చేపట్టాడు.

ఈ సందర్భంగా ఆమె లుకేమియా(కేన్సర్)తో బాధపడుతుందని తెలుసుకున్న జేమ్స్.. బిల్లును సున్నా పౌండ్లుగా చూపించాడు. ఈ బిల్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో జేమ్స్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఈ విషయమై జేమ్స్ మాట్లాడుతూ.. వృద్ధులు, నిరుపేదలు డబ్బులు లేని కారణంగా చలిలో మగ్గిపోకూడదన్న ఉద్దేశంతోనే తాను డెఫెర్ కంపెనీ పెట్టానని తెలిపాడు.

తాము 24 గంటలూ సేవలు అందిస్తామన్నాడు. తాము ఇప్పటివరకూ ఇలా వందలాది మందికి సేవలు అందించామని పేర్కొన్నాడు. దీని కారణంగా తనకు రూ.7.13 లక్షల అప్పు ఏర్పడిందని జేమ్స్ చెప్పాడు. డబ్బులను దగ్గర దాచుకోవడం కన్నా పేదలకు సాయం చేయడం వల్లే  తనకు సంతృప్తి దక్కుతుందని జేమ్స్ వ్యాఖ్యానించాడు. కాగా, జేమ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

More Telugu News