Tamilnadu: అక్రమ బ్యానర్లు తొలగించాలని ఇంజనీర్ ఆదేశం.. వెంటపడిమరీ కొట్టిన ఎండీఎంకే కార్యకర్తలు!

  • తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన
  • వైఎంసీఏ స్టేడియం వద్ద అక్రమ బ్యానర్లు
  • తొలగించాలని ఆదేశించిన ప్రభుత్వ ఇంజనీర్

తమిళనాడు రాజధాని చెన్నైలో శుభశ్రీ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఓ బ్యానర్ మీద పడిన కారణంగా ప్రమాదం జరిగి, ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అక్రమ బ్యానర్లను హైకోర్టు ఆదేశాలతో తొలగిస్తున్న సిబ్బందిపై ఎండీఎంకే కార్యకర్తలు దాడికి దిగారు. అక్రమ బ్యానర్లను వెంటనే తొలగించాలని శుభశ్రీ ఘటన తర్వాత మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైఎంసీఏ స్టేడియం వద్ద అక్రమ బ్యానర్లు వెలిశాయని కొందరు స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నగరంలోని వైఎంసీఏ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన బ్యానర్లు, ప్లెక్సీలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఎండీఎంకే కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ‘మా నాయకుడిని స్వాగతించడానికి పెట్టిన బ్యానర్లనే తొలగిస్తావా?’ అంటూ చితకబాదారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ దాడికి పాల్పడిన ఎండీఎంకే కార్యకర్తల నుంచి ఇంజనీర్ ను కాపాడిన పోలీసులు కారులో తరలించారు. ఎండీఎంకే పార్టీకి వైగో నేతృత్వం వహిస్తున్నారు.

More Telugu News