Karnataka: ‘నువ్వు దళితుడివి.. ఊర్లోకి రానివ్వం ఫో’.. బీజేపీ ఎంపీకి ఘోర అవమానం!

  • కర్ణాటకలోని తుమకూరులో ఘటన
  • చిత్రదుర్గ ఎంపీని అడ్డుకున్న గ్రామస్తులు
  • దళితులను ఊర్లోకి రానివ్వబోమని స్పష్టీకరణ
  • మనస్తాపంతో వెనుదిగిన ఎంపీ నారాయణస్వామి

భారత్ లో కుల రక్కసి ఎంత బలంగా ఉందో తెలిపే ఘటన ఇది. తమ గ్రామంలోకి దళితులు రావడానికి వీల్లేదని ఓ లోక్ సభ సభ్యుడినే ప్రజలు అడ్డుకున్నారు. దళితులను ఊర్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతో సదరు లోక్ సభ సభ్యుడు మనస్తాపంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 బీజేపీ నేత నారాయణ స్వామి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చిత్రదుర్గ స్థానం నుంచి గెలుపొందారు. నారాయణ స్వామి దళిత సామాజికవర్గానికి చెందినవారు. ఈ క్రమంలో తుమకూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు, మందులు ఇచ్చేందుకు ఓ వైద్య బృందాన్ని తీసుకుని నారాయణ స్వామి జిల్లాలోని పావగడకు బయలుదేరారు.

అయితే వీరికి అనుకోని ప్రతిఘటన ఎదురైంది. దళితుల కులానికి చెందిన నారాయణ స్వామిని తమ ఊరిలో అడుగుపెట్టనివ్వబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. వెంటనే వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపానికి లోనైన నారాయణస్వామి అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించారు. ఈ విషయం తెలుసుకున్న తుమకూరు ఎస్పీ విచారణకు ఆదేశించారు.

More Telugu News