Chandrababu: వేధింపులు భరించలేకనే కోడెల ఆత్మహత్య: చంద్రబాబునాయుడు

  • గత 3 నెలలుగా కోడెలకు వేధింపులు ఎక్కువయ్యాయి
  • భరించలేకనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది
  • ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావు

గత మూడు నెలల నుంచి కోడెల శివప్రసాదరావుకు వేధింపులు ఎక్కువయ్యాయని, వాటిని భరించలేకనే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, గతంలో పల్నాడు ప్రాంతానికి తాను వెళ్లినప్పుడు ‘పల్నాడు పులి కోడెల’ అనే స్లోగన్స్ వినపడేవని, ఒక టైగర్ లా ఆయన బతికారని అన్నారు. పార్టీకి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి అని కొనియాడారు.

‘సమస్యలు వస్తాయి. పోరాడదాం’ అని అనేకసార్లు కోడెలకు చెప్పాను కానీ, ‘ఎక్కడో మనిషి అవమానాన్ని భరించలేకపోయాడు’ అని, ఆ అవమానాన్ని భరించలేక తనకు నిద్ర కూడా రావడం లేదని కోడెల తనతో గతంలో రెండుమూడుసార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

‘ధైర్యంగా ఉండు. అధైర్యపడొద్దు. ఇవన్నీ వాళ్లు కావాలని చేసినప్పుడు మీరు ధైర్యంగా ఫేస్ చేసి, రాష్ట్రంలోని కార్యకర్తలకు గానీ ప్రజలకు గానీ ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని’ కోడెలకు చెప్పినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి సంక్షోభాన్ని అయినా, ఇబ్బందినైనా ఎదుర్కొన్న కోడెల తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయారని అన్నారు. ఇందుకు గల కారణాలను ప్రజలందరూ చర్చించాల్సిన అవసరం ఉందని, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావని సూచించారు.

More Telugu News