Kurnool District: ఏరు పొంగి పాఠశాలలోకి ప్రవేశించిన వరద నీరు : ప్రాణభయంతో వణికిన విద్యార్థులు

  • కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఘటన
  • వందల మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
  • విద్యార్థులను రక్షించిన గ్రామస్థులు

పాఠశాల సమీపంలో ప్రవహిస్తున్న ఓ ఏరు పొంగి ప్రవహించి వరద నీరు పాఠశాల ఆవరణలోకి చేరడంతో వందలాది మంది విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోయారు. చుట్టుముట్టిన వరద నీటి నుంచి తప్పించుకోవడం ఎలాగో అర్థంకాక దిక్కులు చూస్తున్నవేళ గ్రామస్థులు చొరవ తీసుకుని వారిని రక్షించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పడకండ్ల బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే... ఈ పాఠశాల ఓ చిన్న నది (ఏరు) పక్కన ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఈ ఏరు పొంగడంతో వరద పాఠశాల ఆవరణలోకి ప్రవేశించింది. అప్పటికి వందలాది మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారు. బస్సుల్లో విద్యార్థులను తరలించి వారిని కాపాడాలని గురుకుల సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. బస్సులు కూడా వరదలో చిక్కుకున్నాయి. దీంతో భయంతో విద్యార్థులు హాహాకారాలు చేస్తుండడంతో గ్రామస్థులు రంగంలోకి దిగారు. నిచ్చెనలు వేసుకుని పాఠశాల తరగతి గదుల్లోకి ప్రవేశించి ఒక్కొక్కరినీ తరలించి కాపాడారు.

More Telugu News