Dhawaleshwaram: గల్లంతైన వారి దేహాలు సముద్రంలోకి వెళ్లకుండా... అధికారుల కీలక నిర్ణయం!

  • ధవళేశ్వరం గేట్ల దించివేత
  • సముద్రంవైపునకు మృతదేహాలు వెళితే వెలికితీత ఆలస్యం
  • అందుకే గేట్లను దించామన్న అధికారులు

నిన్న గోదావరి నదిలో లాంచీ మునిగిపోయిన ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోకుండా, అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అన్ని గేట్లనూ కిందకు దించారు. మృతదేహాలు నీటిపైనే కొట్టుకు వస్తాయి కాబట్టి, నీటి మట్టానికి కాస్తంత దిగువ వరకూ గేట్లను మూసివేయాలని పై అధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు జలాశయం ఉద్యోగులు వెల్లడించారు.

దీంతో సముద్రంలోకి వదులుతున్న నీటిని కాస్తంత తగ్గించామని, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని అనుసరించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొట్టుకువచ్చే మృతదేహాలు సముద్రంవైపునకు వెళితే, దాదాపు 500 చదరపు కిలోమీటర్ల పరిధికి పైగానే గాలింపు చర్యలు చేపట్టాల్సి వస్తుంది.

ప్రమాదం జరిగి ఇంకా 24 గంటలు దాటలేదు కాబట్టి, మృతదేహాలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఎక్కువ దూరం కొట్టుకువచ్చే అవకాశాలు లేవు. అందువల్లే ధవళేశ్వరం డ్యామ్ గేట్లను నీటిలోకి మూడు అడుగుల మేరకు దించినట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News