Mokshagundam visweswaraiah: రైలు శబ్ధం విని పట్టాలు విరిగాయని చెప్పేశారు.. దిగ్గజ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు నేడే!

  • నేడు ఇంజనీర్ల దినోత్సవం
  • హైదరాబాద్, మైసూరుకు సాయం చేసిన విశ్వేశ్వరయ్య
  • భారతరత్న అవార్డుతో సత్కరించిన కేంద్రం

భారత్ నేడు ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా కేంద్రం ఈ వేడుకను నిర్వహిస్తోంది. మైసూరు, హైదరాబాద్ లు మహానగరాలుగా అవతరించడంలో విశ్వేశ్వరయ్య కృషి ఎంతగానో ఉంది. రైలు పట్టాల నుంచి వచ్చే శబ్దాలను దూరం నుంచి విని, పట్టాలు విరిగిపోయాయని చెప్పిన ఘనత విశ్వేశ్వరయ్యదే. అంతటి గొప్ప ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనహళ్లిలో జన్మించారు.

అప్పట్లో ఈ ప్రాంతం మైసూరు సంస్థానంలో భాగంగా ఉండేది. విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన తండ్రి శ్రీనివాస శాస్త్రి చనిపోయారు. 1881లో ఆయన బెంగళూరులో డిగ్రీ, ఆ తర్వాత పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ముంబైలోని ప్రజాపనుల విభాగంలో కొద్దికాలం ఉద్యోగం చేశారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వంలోని ఇరిగేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు.  1912 నుంచి 1918 వరకూ విశ్వేశ్వరయ్య మైసూర్ సంస్థానానికి మంత్రి(దివాన్)గా పనిచేశారు.

మాండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్,  భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, మైసూర్ శాండల్ ఆయిల్ అండ్ సోప్ ఫ్యాక్టరీ, యూనివర్శిటీ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ మైసూర్ సహా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు, ప్రాజెక్టుల ఏర్పాటులో విశ్వేశ్వరయ్య కృషి ఎంతగానో ఉంది. మైసూర్ నగరాభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రణాళికలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇక హైదరాబాద్ నగరంలో మూసీ వరదల నివారణకు విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్లాన్స్, హైదరాబాద్ నిజాం నవాబును ఎంతగానో మెప్పించాయి.

విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ పటిమపై ఓ విషయం విశేషంగా ప్రాచుర్యంలో ఉంది. ‘ఓసారి బ్రిటిషర్లతో కలిసి విశ్వేశ్వరయ్య ఓ రైలులో వెళుతుండగా, పట్టాల శబ్దం తేడాగా వినిపించిందంట. వెంటనే అప్రమత్తమైన ఆయన చైన్ లాగేశారు. దీంతో చైన్ ఎందుకు లాగారని గార్డు ప్రశ్నించారు. ‘కొద్దిదూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నట్లు నాకు అనిపిస్తోంది.

రైలు వేగం, వస్తున్న శబ్ధాన్ని బట్టి పట్టాలు విరిగాయనిపిస్తోంది’ అని విశ్వేశ్వరయ్య జవాబు ఇచ్చారు. దీంతో రైలు ముందు కొద్దిదూరం నడిచివెళ్లిన గార్డుకు షాక్ తగిలింది. ఎందుకంటే పట్టాలు నిజంగా విరిగిపోయి ఉన్నాయి’’ కాగా, విశ్వేశ్వరయ్య అందించిన సేవలకు గానూ 1955లో భారత ప్రభుత్వం ‘భారత రత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. అప్పటి బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన కింగ్ జార్జ్-5 నైట్ కమాండర్ బిరుదుతో సత్కరించారు.

More Telugu News