Saudi Arebia: సగానికి పడిపోయిన సౌదీ చమురు ఉత్పత్తి... పెరిగిన క్రూడాయిల్ ధర!

  • 10 శాతం ముడిచమురు సౌదీదే
  • 57 లక్షల బ్యారళ్ల ఉత్పత్తి కోత
  • అత్యవసర నిల్వలు వాడతామన్న అమెరికా

ప్రపంచానికి అవసరమైన 10 శాతం ముడి చమురును అందిస్తున్న సౌదీ అరేబియా, ప్రధాన చమురు క్షేత్రమైన అరామ్ కో యమన్ హౌతీ రెబల్స్ జరిపిన డ్రోన్ దాడులు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి. రోజుకు కోటి బ్యారళ్లకు పైగా చమురును ఉత్పత్తి చేసే సౌదీ, 57 లక్షల బ్యారళ్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 1991లో జరిగిన గల్ఫ్ వార్ తరువాత సౌదీ అరేబియా, ఇంత భారీ మొత్తంలో చమురు ఉత్పత్తిని నిలిపివేయడం ఇదే తొలిసారి.

దాదాపు 10 డ్రోన్ బాంబులను ప్రయోగించిన యమన్ తిరుగుబాటుదారులు, అరామ్ కో పై విరుచుకుపడ్డారు. ఇక్కడి చమురు క్షేత్రాల్లో అత్యధికం నాశనం కాగా, పొగలు రెండు కిలోమీటర్ల ఎత్తునకు వ్యాపించాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం వరకూ ఇవి కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో కోతను విధించిన మరుక్షణం, ముడి చమురు ధర అర శాతానికి పైగా పెరిగింది. సోమవారం సైతం క్రూడాయిల్ ధర పెరుగుతుందని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ముడి చమురు సరఫరాను యథాతథంగా ఉంచేలా చూసేందుకు అత్యవసర చమురు నిల్వలను వినియోగిస్తామని అమెరికా ప్రకటించింది. సౌదీపై జరిగిన దాడిని ఖండిస్తూనే, ఆ దేశ ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించింది. సౌదీ రాజుతో ఫోన్ లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పరిస్థితిని, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 60 డాలర్లకు పైగా కొనసాగుతోంది.

More Telugu News