vijayashanthi: కుక్క ప్రాణాలకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా?: కేసీఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్

  • కుక్క చనిపోతే డాక్టర్‌పై కేసులు పెడతారా?
  • ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలేవి?
  • సంక్షోభాన్ని ఎంతోకాలం దాచలేరు

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి మరోమారు మండిపడ్డారు. జబ్బుల బారినపడి రాష్ట్ర ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం.. సీఎం ఇంట్లోని కుక్క జ్వరంతో చనిపోతే డాక్టర్లపై కేసులు పెడుతున్నారన్న వార్తలు చూసి జనం విస్తుపోతున్నారని అన్నారు. దీనిని బట్టి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలోని కుక్క ప్రాణాలకు ఉన్న విలువ తెలంగాణ ప్రజలకు లేదన్న విషయం మరోమరు అర్థమైందన్నారు.

విష జ్వరాల బారినపడి తెలంగాణ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ఆరోగ్య శాఖ అధికారులపై చర్యలు ఉండవని, ఇంటర్ పరీక్ష పేపర్లను అడ్డగోలుగా దిద్ది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపైనా చర్యలు ఉండవని, కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రేమగా పెంచుకున్న హస్కీ అనే కుక్క జ్వరం వచ్చి చనిపోతే మాత్రం వైద్యులపై దారుణమైన చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

సరైన వైద్యం అందని కారణంగా కుక్క మరణించిందనే కారణంతో దానికి చికిత్స చేసిన డాక్టర్ రంజిత్‌పై  ఐపీసీ 429 సెక్షన్ 11(4)తోపాటు, ప్రివెంటివ్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఇది చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయిందని విజయశాంతి అన్నారు. కేసీఆర్ దొరతనాన్ని చూసి ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారనే వాదన కూడా ఉందన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, నేతలను ప్రలోభ పెట్టి లొంగదీసుకోవచ్చేమో కానీ, సంక్షోభాన్ని ఎంతోకాలం దాచలేరని విజయశాంతి హెచ్చరించారు.

More Telugu News