car: కారే లేని వ్యక్తి సీటు బెల్టు ధరించకుండా వాహనం నడిపాడట.. 8 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి నోటీసులు

  • రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఘటన
  • లైసెన్స్ రద్దు చేస్తున్నామంటూ నోటీసులు
  • విస్తుపోయిన కుటుంబ సభ్యులు

సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపినందుకు లైసెన్స్ రద్దు చేస్తున్నామంటూ ఎనిమిదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి రవాణాశాఖ అధికారులు నోటీసులు పంపారు. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిన ఈ ఘటన రాజస్థాన్‌లోని ఝలావర్‌లో జరిగింది. జిల్లాకు చెందిన రాజేంద్ర కసేరా అనే వ్యక్తి సెప్టెంబరు 2011లో మృతి చెందాడు.

ఈ నెల 11న ఆయన కారును అతివేగంగా నడిపారని, అంతేకాక సీటు బెల్టు కూడా ధరించలేదని, కాబట్టి ఆయన లైసెన్స్‌ను రద్దు చేస్తున్నామంటూ రవాణా శాఖ అధికారులు రాజేంద్రకు నోటీసులు పంపారు. అవి చూసిన కుటుంబ సభ్యులు విస్తుపోయారు. 8 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడెలా నిబంధనలు ఉల్లంఘించాడంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు ద్విచక్ర వాహనం తప్ప మరే వాహనమూ లేదని చెబుతున్నారు. కాగా, అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

More Telugu News