Pawan Kalyan: రూ. 24 వేల కోట్లు పెట్టుబడిగా పెడతామన్న కంపెనీని కూడా వదులుకున్నారు: పవన్ కల్యాణ్

  • ఏపీలో టెర్రర్ గవర్నమెంట్ నడుస్తోందని రామచంద్ర పాయ్ అన్నారు
  • రాష్ట్రాన్ని వ్యాపారిలా పాలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి
  • వరదలు వచ్చినప్పుడు సీఎం, మంత్రులు ఎవరి పనుల్లో వారు ఉన్నారు

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో టెర్రర్ గవర్నమెంట్ నడుస్తోందని ఇన్ఫోసిన్ మాజీ డైరెక్టర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత రామచంద్ర పాయ్ ఇటీవల వ్యాఖ్యానించారని... ప్రభుత్వం టెర్రర్ క్రియేట్ చేస్తోందని చెప్పారని... గవర్నమెంట్ టెర్రరిజం అనే పదాన్ని ఆయన వాడారని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలని అన్నారు.

పెట్టుబడులను ఆకర్షించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రంలో రూ. 24 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఇండొనేషియా కంపెనీని కూడా వదులుకున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులు వెళ్లిపోతే... కొత్తవారు ఎవరూ రారని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ 100 రోజుల పాలనపై నివేదికను విడుదల చేసిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పరిపాలనను ఒక ధర్మకర్తలా చేయాలని... వ్యాపారిలా పాలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్ అన్నారు. గ్రామ వాలంటీర్లతో సమాంతర వ్యవస్థను తయారు చేస్తున్నారని విమర్శించారు. కేవలం వైసీపీ క్యాడర్ కోసం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని... ఎన్నికల్లో వైసీపీ కొరియర్లుగా వాలంటీర్లు పని చేస్తారని దుయ్యబట్టారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ అమెరికాలో, మంత్రులు వారి సొంత పనుల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.

ఎటువంటి ఫ్లడ్ మేనేజ్ మెంట్ చేయకుండా నీళ్లను సముద్రంపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపును పట్టించుకోకుండా మంత్రులంతా చంద్రబాబు ఇంటి చూట్టూ తిరిగారని విమర్శించారు. పాలన అంటే వైసీపీ నేతలకు ఆకతాయిగా ఉందని అన్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా... కర్నూలును రాజధాని చేస్తామని తాను ఎన్నడూ చెప్పలేదని... అమరావతికి దీటైన నగరంగా కర్నూలును తీర్చిదిద్దుతామని మాత్రమే చెప్పానని తెలిపారు.

More Telugu News