USA: వెనిజులా పాలకుడు మదురోకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్!

  • మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రకటన
  • అధికారం నుంచి తప్పుకోవాలని సూచన
  • ఆర్థిక ఆంక్షలతో అల్లాడిపోతున్న వెనిజులా ప్రజలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పాలకుడు నికోలస్ మదురోపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మదురో వెంటనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకపోతే మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. వెనిజులాలో సోషలిస్టు మదురోను అధికారం నుంచి తప్పించేందుకు అమెరికా విశ్వప్రయత్నాలు చేసింది. ఆ దేశంపై పలు రకాల ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించింది. వెనిజులా నుంచి విదేశాలు చమురు కొనకుండా కట్టడి చేసింది. దీంతో వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోగా, లక్షలాది మంది ప్రజలు ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల కోసం అల్లాడిపోయారు.

దేశంలో బతకలేక 40 లక్షల మంది ప్రజలు పొరుగుదేశాలకు కట్టుబట్టలతో వలస వెళ్లారు. అయినా మదురో అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధం కాలేదు. మరోవైపు వలసదారుల విషయంలో వెనిజులా-కొలంబియా దేశాల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో వెనిజులా ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకున్నా, తమ సైన్యం కొలంబియాకు మద్దతు ఇస్తుందని అమెరికా హామీ ఇచ్చింది.

దక్షిణ అమెరికాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ ట్రంప్ సైనిక చర్యకు దిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ నేత మదురో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నేత జాన్ గ్వైడో, అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు ఆరోపించాయి. మదురో పదవి నుంచి తప్పుకుని స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరాయి. దీనికి మదురో అంగీకరించకపోవడంతో ఆంక్షలు విధించాయి.

More Telugu News