MDH products: ఆ సాంబారు మసాలా యమ డేంజర్‌...అందులో హానిచేసే బ్యాక్టీరియా: అమెరికా పరిశోధన సంస్థ

  • భారత్‌ విభాగాలకు లేఖ ద్వారా సమాచారం
  • సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉందని వెల్లడి
  • దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని సూచన

షార్జాలోని ఆర్-పురె అగ్రో స్పెషాలిటీస్ లో తయారవుతున్న ఓ ఆహార ఉత్పత్తుల సంస్థపై అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) బాంబు పేల్చింది. అక్కడి ఎండీహెచ్‌ బ్రాండ్‌ సాంబారు మసాలాల్లో ప్రమాదకరమైన సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియాను తాము గుర్తించినట్లు తెలిపింది. దీనివల్ల ఈ మసాలాను వినియోగించిన వారు 12 నుంచి 72 గంటల్లోగా అతిసార, వాంతులు, తిమ్మిర్లతో బాధపడతారని, జ్వరం తీవ్రంగా వస్తుందని స్పష్టం చేసింది.

ఈ ఉత్పత్తులు హౌస్‌ ఆఫ్‌ స్పైసెస్‌ (ఇండియా) ద్వారా కాలిఫోర్నియాలోని రిటైల్‌ స్టోర్లకు చేరాయని, ఆరోపణలు రావడంతో తాము పరిశోధనలు జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు తమ పరిశోధన అంశాలను వివరిస్తూ ఆల్‌ ఇండియా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ లైసెన్స్‌  హోల్డర్ ఫౌండేషన్‌ (ఏఎఫ్‌డీఎల్‌హెచ్‌ఎఫ్‌) మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) విభాగానికి లేఖ రాయడంతో బాధ్యులైన అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎండీహెచ్‌ సాంబార్‌ మసాలా దినుసుల్లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉందని ఆరోపణలు రావడంతో కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తుల నమూనాలను పరిశీలించాలని ఎఫ్‌డీఏకు సూచించారు. వారు పరిశీలించాక బ్యాక్టీరియా ఉన్న విషయాన్ని నిర్థారించడంతో ఈ ఉత్పత్తులు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాయో ఆరా తీశారు. దీంతో ప్రమాదకర బ్యాక్టీరియా ఉందన్న సాంబారు మసాలా ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు  హౌస్‌ ఆఫ్‌ స్పైసెస్‌ (ఇండియా) ప్రకటించింది.

More Telugu News