Pawan Kalyan: బొత్స ఆస్తులమ్మి పోలవరం పూర్తి చేస్తారా? మీ దగ్గరున్న లక్ష కోట్లను పెట్టుబడిగా పెడతారా?: పవన్ కల్యాణ్

  • పోలవరం టెండర్లను రద్దు చేసి ఏం సాధిస్తారు?
  • వైసీపీ మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు
  • ఇష్టానుసారం వ్యవహరిస్తే రాజధానిని కట్టుకోగలమా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు ఉంటే సరిచేయాలే కానీ... టెండర్లను రద్దు చేసి ఏం సాధిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ తన ఆస్తులను అమ్మి పోలవరంను పూర్తి చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం... టీడీపీ ఆరోపిస్తున్నట్టు మీ వద్ద ఉన్న లక్ష కోట్లను పెట్టుబడిగా పెడతారా? అని జగన్ ను ఉద్దేశించి అన్నారు. జగన్ 100 రోజుల పాలనపై నివేదికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చామని... అమరావతిని చాలా లోతుగా చూడాల్సి ఉందని చెప్పారు. అమరావతిని రాజధానిగా జగన్ సహా వైసీపీ నేతలంతా గతంలో సమర్థించారని... ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిపై టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారని... అది టీడీపీ చేతకానితనం అనుకుందామని... ఇప్పుడు మీరు ఇవ్వండని తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. వైసీపీ మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

అమరావతిలో ఇప్పటికే రూ. 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని... ఇప్పుడు రాజధానిని మారుస్తామని చెబుతున్నారని... ఇష్టానుసారం వ్యవహరిస్తే రాజధానిని కట్టుకోగలమా? అని ప్రశ్నించారు. రైతులకు విత్తనాలు ఇవ్వకపోగా... వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కన్నీరు పెడితే అధ:పాతాళానికి వెళ్లిపోతారని వైసీపీ నేతలకు చెబుతున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News