India: ఇద్దరు పాక్ సైనికులను కాల్చిచంపిన భారత్.. తెల్ల జెండా చూపిస్తూ వచ్చి శవాలను పట్టుకెళ్లిన పాక్ ఆర్మీ.. వీడియో!

  • నియంత్రణ రేఖ సమీపంలోని హాజీపూర్ సెక్టార్ లో ఘటన
  • ఈ నెల 10-11 తేదీల్లో సరిహద్దులో కాల్పులు
  • భారత్ దీటుగా స్పందించడంతో తోక ముడిచిన పాక్

సరిహద్దులో భారత్ ను కవ్విస్తున్న పాక్ ఆర్మీకి భారత సైన్యం దీటుగా జవాబు ఇచ్చింది. భారత ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న పాక్ కుట్రను తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్ రేంజర్లు చనిపోయారు. దీంతో తెల్లజెండాను చూపిస్తూ వచ్చిన పాక్ జవాన్లు తమ సైనికుల మృతదేహాలను పట్టుకెళ్లారు. ఈ నెల 10-11 తేదీల మధ్య జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న హాజీపూర్ సెక్టార్ లో భారత ఆర్మీ పోస్టులపై ఈ నెల 10,11 తేదీల్లో పాక్ బలగాలు భారీఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భారత ఆర్మీ వారి కుట్రను దీటుగా తిప్పికొట్టింది. పాక్ ఆర్మీ పోస్టులు లక్ష్యంగా విరుచుకుపడింది. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో పాక్ బలగాలు తోకముడిచాయి. అయితే భారత్ చేసిన దాడిలో పాక్ ఆర్మీలోని ఇద్దరు రేంజర్లు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఆర్మీ నిబంధనల ప్రకారం పాక్ సైనికులు కొందరు తెల్లజెండాతో ముందుకు వచ్చారు. తెల్లజెండాను చూపితే కాల్చవద్దని అర్థం. దీంతో భారత బలగాలు తమనుతాము నియంత్రించుకున్నాయి. ఈ సందర్భంగా తమవారి మృతదేహాలను పాక్ తీసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి భారత ఆర్మీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

More Telugu News