Tamil Nadu: తమిళనాడులో 5, 8 తరగతులకు పబ్లిక్‌ పరీక్షలు: ప్రభుత్వం నిర్ణయం

  • ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
  • ప్రస్తుతం అక్కడ టెన్త్‌, ప్లస్‌-1,2కు మాత్రమే ఈ విధానం
  • లాంగ్వేజెస్‌కు ఒకటే పేపర్‌

తమిళనాడు రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 5, 8వ తరగతులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పదో తరగతి, ప్లస్‌-1,2 (ఇంటర్‌) విద్యార్థులకు మాత్రమే ఈ విధానం అమల్లో ఉండగా, తాజాగా మరో రెండు స్థాయులలో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే, పదో తరగతి పరీక్షల్లో లాంగ్వేజెస్‌ అయిన తమిళం, ఇంగ్లీష్‌ సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉండేవి. ఇకపై ఒక్క పేపరే ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే తమిళం ఒకటి, ఇంగ్లీష్‌ ఒక పేపరు రాస్తే సరిపోతుంది. గత ఏడాదే ప్రభుత్వం ర్యాంకుల విధానాన్ని రద్దు చేసింది. అలాగే ప్లస్‌-1లో కూడా పబ్లిక్‌ పరీక్షలు అమలు చేస్తోంది. తాజా నిర్ణయంతో ఒకటి నుంచి ఇంటర్‌ మధ్య అక్కడి విద్యార్థులు ఐదు సార్లు పబ్లిక్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒకటి నుంచి 9వ తరగతి వరకు హాజరు ఆధారంగా పై తరగతికి ప్రమోషన్‌ చేసేవారు. ఇకపై పబ్లిక్‌ పరీక్షలో పాస్‌ కాకుంటే మళ్లీ ఆ తరగతిలోనే చదవాల్సి వస్తుంది.

More Telugu News