Chhattisgarh: దంతెవాడలో భారీ ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి!

  • ఎన్నికల నేపథ్యంలో బలగాల కూంబింగ్
  • కుంత్రేమ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్
  • మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుల మృతి

పచ్చటి అడవి మరోసారి నెత్తురోడింది. ఓవైపు మావోయిస్టులు, మరోవైపు భద్రతాబలగాల తుపాకీ కాల్పులతో అడవి బిడ్డలు చిగురుటాకుల్లా వణికిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో నిన్న అర్ధరాత్రి దాటాక భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. దంతెవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయని తెలిపారు.

ఇందులో భాగంగా బలగాలు కుంత్రేమ్ గ్రామానికి సమీపంలోని అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోలు ఒక్కసారిగా దాడిచేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కొన్నిగంటల అనంతరం మావోలవైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని చెప్పారు. దీంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించగా, ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు.

వీరిద్దరూ స్థానిక మలంగీర్ ఏరియా కమిటీ సభ్యులనీ, వీరి తలపై చెరో రూ.5 లక్షల రివార్డు ఉందని వ్యాఖ్యానించారు. ఘటనాస్థలి నుంచి ఇటలీ తయారీ 9 ఎంఎం తుపాకీ, బోర్ గన్ తో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అభిషేక్ పల్లవ్ చెప్పారు. బీజేపీ నేత, దంతెవాడ ఎమ్మెల్యే భీమా మండావీని మావోయిస్టులు ఈ ఏడాది ఏప్రిల్ లో దారుణంగా కాల్చిచంపారు. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News