Andhra Pradesh: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యర్థి వర్గాల ఘర్షణ.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది!

  • ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన
  • ఈరోజు గోస్పాడులో కొట్టుకున్న రెండు వర్గాలు
  • గాయాలతో ఆసుపత్రికి వచ్చాక మళ్లీ ఘర్షణ

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు రెండు గ్రూపులు కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసుకున్నాయి. ఈ సందర్భంగా తీవ్రగాయాలతో ఆసుపత్రికి చేరుకున్న ఇరువర్గాలు కసితీరక మరోసారి కొట్టుకున్నాయి. ఈ ఘటన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోస్పాడుకు చెందిన రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు గ్రూపులు ఈరోజు కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడిచేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో వీరిని బంధువులు, కుటుంబ సభ్యులు నంద్యాల గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో తమ ప్రత్యర్థులను చూడగానే ఇరువర్గాలు మళ్లీ రెచ్చిపోయాయి. ఏది కనబడితే దాన్ని తీసుకుని దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆసుపత్రిలోని డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం కాగా, వైద్య సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులకు చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

More Telugu News