nagartuna sagar lanch: కృష్ణమ్మకు వరద పోటు భయం...సాగర్‌ లాంచీ ప్రయాణం రద్దు

  • తెలంగాణ పర్యాటక శాఖ ముందు జాగ్రత్త చర్యలు
  • రేపు రావద్దని సందర్శకులకు సూచన
  • తదుపరి పరిస్థితిపై నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి

నాగార్జున సాగర్‌ నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్లి మల్లన్న దర్శనం చేసుకోవాలని ఉబలాటపడే వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన లాంచీ ప్రయాణానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది. రేపు లాంచీ ప్రయాణాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజులుగా జలాశయానికి భారీగా వరద తరలి వస్తుండడంతో జలాశయంలో పరిస్థితి ప్రయాణానికి అనుకూలంగా లేదని అధికారులు స్పష్టం చేశారు.

కృష్ణా నదిలో సంతృప్తికరంగా నీటి నిల్వలు ఉండడంతో తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు లాంచీ ప్రయాణాన్ని ఇటీవల మొదలు పెట్టిన విషయం తెలిసిందే. టికెట్లు బుక్‌ చేసుకున్న వారిని ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌లో పికప్‌ చేసుకుని బస్సులో నాగార్జున సాగర్‌కు చేర్చడం, అనంతరం లాంచీలో శ్రీశైలం తీసుకువెళ్లి మల్లన్న దర్శనం చేయించడం, రాత్రికి అక్కడే బసచేసి చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపించడం, తిరిగి లాంచీలో సాగర్‌కు చేరుకుని మరునాడు రాత్రి 7.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకునేలా పర్యాటక శాఖ ప్యాకేజీ అమలు చేస్తోంది. అయితే నదిలో ప్రస్తుతం వరద పెరుగుతోందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రేపు లాంచీ ప్రయాణాన్ని రద్దు చేసినట్లు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు.

More Telugu News