Telugudesam: ‘ఏసీ లేదు, ఇంత దరిద్రంగా ఉందేంటీ జీపు’ అని మాత్రమే ఆ రోజు అనుకున్నారు.. అంతే!: నన్నపనేని రాజకుమారి

  • మహిళా ఎస్సైను కులం పేరిట నేను దూషించలేదు
  • ఆరోజున ఒకటే జీపులో  మహిళా ఎస్సై, మేము వచ్చాం
  • ‘నన్ను గుర్తుపట్టలేదా?’ అని ఆమె నన్ను అడిగారు

దళిత మహిళా ఎస్సైను కులం పేరిట దూషించారంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఖండించారు. ఆమె మాట్లాడుతూ, ‘ఆరోజున ఉండవల్లి నుంచి ఒకటే జీపులో ఆమె(మహిళా ఎస్సై), మేము వచ్చామా? లేదా? ‘మీ పక్కనే కూర్చుంటాను అమ్మా’ అని ఆమె నా పక్కనే కూర్చున్నారా? లేదా? ‘మీరు నాకు తెలుసమ్మా.. మేడికొండూరులో నేను చేశాను. నన్ను గుర్తుపట్టలేదా?’ అని టోపీ తీసి ఆమె ఫేస్ నాకు చూపించారా? లేదా? ‘అయ్యో గుర్తు పట్టలేదమ్మా.. చాన్నాళ్లు అయింది కదా చూసి’ అని నేను అన్నానా? లేదా? ‘ఎక్కడ చేస్తున్నారు?’ అని నేను అడిగితే, ‘పెదకాకాని’ అని చెప్పారా? లేదా?’ అని ప్రశ్నించారు.

మహిళా ఎస్సై అరవడానికి ముందు ఏం జరిగిందంటే.. ఉండవల్లి నుంచి మంగళగిరికి తమను తీసుకు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడుని ఒక జీపులో, తమను మరో జీపులో తీసుకెళ్లారని చెప్పారు. అయితే, ‘మేము కూర్చున్న జీపులో ఏసీ లేదా?’ అని తన వెనుక కూర్చున్న టీడీపీ నాయకురాలు అనిత, పార్టీలో పని చేసే సత్యవాణి అడిగారు. ‘ఏసీ లేదు’ అని జీపులో ఉన్న సిబ్బంది చెప్పారు. ‘మా ముందు ఉన్న జీపులో ఏసీ లేదా? అని అడిగితే, ‘అందులో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు’ అని సమాధానం చెప్పారు. ‘మగవాళ్లకేమో ఏసీ జీపు, ఆడవాళ్లకేమో ఏసీ లేని జీపు ఇచ్చారులే’ అని నవ్వుకున్నాం’ అని గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలో ఆ మహిళా ఎస్ఐ అక్కడ లేరని, మరి, వెనకాలే ఏమైనా ఉన్నారేమో తనకు తెలియదు అని రాజకుమారి అన్నారు. ‘ఏసీ లేదు, ఇంత దరిద్రంగా ఉందేంటీ జీపు’ అని తన వెనుక కూర్చున్న మహిళలు అనుకున్నారు. అంతే, మహిళా ఎస్ఐ అక్కడికి వచ్చి వాళ్ల వైపు చూస్తూ అరిచారని అన్నారు. ‘ఏంటమ్మా, ఎందుకు అట్లా అరుస్తున్నావు’ అని అడిగే లోపల, ఆమె నా వైపు తిరిగి, నా వంక వేలు చూపిస్తూ, ఎస్ఐ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఆమెను కులం పేరిట తాను దూషించినట్టు ఎక్కడా అనలేదని రాజకుమారి పేర్కొన్నారు.

More Telugu News