Vijayawada: ‘అగ్రిగోల్డ్’ బాధితులకు ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా ముట్టలేదు: ముప్పాళ్ల నాగేశ్వరరావు

  • జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
  • బాధితుల సంఘానికి సీఎం అపాయింట్మెంట్  దక్కలేదు
  • గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులైనా విడుదల చేయండి

అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రూ.20 వేల లోపు ఉన్న బాధితులకు న్యాయం చేసేందుకు రూ.1150 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపి మూడు నెలలు గడిచినా సంబంధిత జీవో జారీ చేయలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా ముట్టలేదని అన్నారు. ఇరవై లక్షల మంది బాధితుల పక్షాన పోరాడే సంఘానికి సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.10 వేల లోపు బాధితులకు రూ.200 కోట్లు మంజూరు చేసిందని, కనీసం ఆ నిధులైనా విడుదల చేసి నాలుగు లక్షల మందికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News