Andhra Pradesh: టన్ను ఇసుకకు రూ.900 వసూలు చేస్తున్నారు, ఏమిటిది?: పవన్ కల్యాణ్

  • ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించిన ‘జనసేన’ అధినేత
  • నవులూరులో ఇసుక స్టాక్ పాయింట్ ఆకస్మిక తనిఖీ
  • ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఇసుక విక్రయించరే?

ఏపీ రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పర్యటించారు. గుంటూరు జిల్లా నవులూరులోని ఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణదారులు  పవన్ దృష్టికి తెచ్చారు.

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు ఆగిపోయాయని, టన్ను ఇసుకకు రూ.900 వసూలు చేస్తున్నారని కార్మికులు చెప్పారని అన్నారు. కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రకటించిన ధరకే ఇసుకను విక్రయించాలి కదా అని ప్రశ్నించారు. టన్ను ఇసుక రూ.370 అని చెప్పి అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు.

పారదర్శకత కోసం కొత్త విధానం అమలు చేసినప్పుడు చెప్పిన ధర ప్రకారం ఇసుక విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ విధానాలపై ఎలాపడితే అలా విమర్శలు చేయమని, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వాటిపై మాత్రమే ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. రేపు కొత్త ఇసుక విధానంపై స్పందిస్తానని పవన్ పేర్కొన్నారు.

More Telugu News